English
Download App from store
author
Anil S Royal
I write mostly science fiction in Telugu. 'Time' is a recurring theme in my fiction, which earned me the nick-name 'Time Travel Agent'. My short stories deal with universal issues that are not confined to any particular gender, race, region or religion. Read them if you want to be awed and thrilled. (A friendly note: Almost always, the real story in my stories is the one that's not told. So pay close attention to every word. It may be an innocent foreshadow, a cunning red herring, or a genuine clue. Enjoy!)
user
Anil S Royal
రాక్షస గీతం
  284 Views
 
  9 Mins Read
 
  1

“Reality is merely an illusion, albeit a very persistent one."

Albert Einstein

* * * * * * * *

చెవులు చిల్లులు పడే శబ్దం. దాన్ననుసరిస్తూ, కాలం నివ్వెరపోయినట్లు క్షణమాత్రపు నిశ్శబ్దం. మరుక్షణం మిన్నంటిన రోదనలు. దట్టంగా పొగ. చెదురుమదురుగా మంటలు. చిందరవందరైన పరిసరాలు. ఛిద్రమైన శరీరాలు. వాటినుండి రక్తపు చుక్కలు పైకెగరసాగాయి. ఒకటి, రెండు, పది, వంద. చూస్తూండగానే చిక్కబడ్డాయవి. నేలమీంచి నింగిలోకి కుండపోతగా రుధిరవర్షం కురవసాగింది. ఆకాశాన్ని చీలుస్తూ నల్లటి మెరుపొకటి మెరిసింది. సమీపంలో పిడుగు పడింది. దిక్కులు పిక్కటిల్లిన చప్పుడుతో - దిగ్గున మెలకువొచ్చింది. ఎప్పుడూ వచ్చేదే. అయినా అలవాటవని కల. పదే పదే అదే దృశ్యం. మానవత్వం మాయమైన మారణహోమం. రక్తంతో రాసిన రాక్షసగీతం. అది నా ఉనికి దేనికో విప్పి చెప్పిన విస్ఫోటనం. నిశ్చలంగా పైకప్పుని చూస్తూ పడుకుండిపోయాను - అది కలో, మెలకువో తెలీని అయోమయంలో. మేలుకోవటమంటే - వాస్తవంలోకి వళ్లు విరుచుకోవటమా, లేక ఒక కలలోంచి మరో కలలోకి కళ్లు తెరుచుకోవటమా? ఇదీ కలే ఐతే మరి ఏది నిజం? "నువ్వేది నమ్మితే నీకదే నిజం," అన్నాడెవరో మేధావి. నిజమేనేమో. సత్యం సైతం సాపేక్షం! అందుకే లోకమంతా ఈ అరాచకత్వం. ఎవడికి నచ్చింది వాడు నిజంగా నమ్మేసి ఎదుటోడి నెత్తిన రుద్దేసే నైజం. అందులోంచి పుట్టేది ముందుగా పిడివాదం. ఆ తర్వాత అతివాదం. అది ముదిరితే ఉన్మాదం. అదీ ముదిరితే - ఉగ్రవాదం. ఆలోచనల్ని బలవంతంగా అవతలకి నెడుతూ మెల్లిగా లేచాను. మరో రోజు మొదలయింది.

* * * * * * * *

"అవకాశం దొరకాలే కానీ ... వాణ్ని అడ్డంగా నరికేసి ఆమెని సొంతం చేసుకుంటా," అనుకున్నాడు వాడు పెదాలు చప్పరిస్తూ. ఇరవైలోపే వాడి వయసు. ఇంజనీరింగ్ విద్యార్ధి వాలకం. చిరిగిన జీన్స్, చింపిరి జుత్తు, ఓ చేతిలో సిగరెట్, ఇంకో చేతిలో కాఫీ కప్, వీపున బ్యాక్‌పాక్. నిర్లక్షానికి నిలువెత్తు రూపం. యమహా మీద ఠీవిగా తిష్ఠవేసి నల్ల కళ్లద్దాల మాటునుండి నిష్ఠగా అటే చూస్తున్నాడు. నేనూ అటు చూశాను. నాలుగు టేబుల్స్ అవతలొక పడుచు జంట. భార్యాభర్తల్లా ఉన్నారు. ఎదురెదురుగా మౌనంగా కూర్చుని ఒకే కప్పులో కాఫీ పంచుకు తాగుతున్నారు. ఆ యువతి సౌందర్యానికి నిర్వచనం. ఆమె భర్త పోతురాజు ప్రతిరూపం. చింపిరిజుత్తు వైపు చూపు తిప్పాను. వాడింకా పెదాలు చప్పరిస్తూనే మర్డర్ ఎలా చెయ్యాలో, ఆ తర్వాత ఆమెతో ఏం చెయ్యాలో ఆలోచిస్తూన్నాడు. ఆమె వాడికన్నా ఆరేడేళ్లు పెద్దదయ్యుంటుంది. కానీ అది వాడి ఆలోచనలకి అడ్డురాని వివరం. ఈ రకం తరచూ తారసపడేదే. ఊహల్లో చెలరేగటమే తప్ప వాటి అమలుకి తెగించే రకం కాదు. ప్రమాదరహితం. వాడినొదిలేసి ఆ పక్కనే ఉన్న టేబుల్‌వైపు చూశాను. అక్కడో ముగ్గురు అమ్మాయిలు. ఇవీ కాలేజ్ స్టూడెంట్స్ వాలకాలే. కాఫీకోసం‌ నిరీక్షీస్తూ మొబైల్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. అలవాటుగా వాళ్ల బుర్రల్లోకి చూశాను. నిమిషంలోపే అర్ధమైపోయింది. పోసుకోలు కబుర్లు. ఎదురు బొదురుగా కూర్చుని ఒకరితో ఒకరు వాట్సాప్‌లో చాట్ చేస్తున్న నవతరం ప్రతినిధులు. హార్మ్‌లెస్ క్రీచర్స్. వాళ్లమీంచి దృష్టి అటుగా వెళుతున్న యువకుడి మీదకి మళ్లింది. ముప్పయ్యేళ్లుంటాయేమో. వడివడిగా నడుస్తూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. అతడి కవళికలు అనుమానాస్పదంగా తోచాయి. ఏమన్నా విశేషమా? వెంటనే అతడిని స్కాన్ చేశాను. ఫ్యామిలీ మాటర్. పట్టించుకోనవసరం లేదు. మరొకరి మీదకి దృష్టి మరల్చబోతూండగా అతను చటుక్కున ఆగిపోయాడు. నేనూ ఆగిపోయాను. ఆ పక్కనే దట్టంగా విరిసిన పూల మొక్క. అందులో ఒక పువ్వునుండి తేనె గ్రోలుతూ నీలిరంగు బుల్లిపిట్ట. నగరాల్లో అరుదైన దృశ్యం. అంత హడావిడిలోనూ అది చూసి ఆగిపోయాడంటే వీడెవడో భావుకుడిలా ఉన్నాడు. ఆటవిడుపుగా అతడిని గమనించాను. నాకూ కాసేపు కాలక్షేపం కావాలిగా. అతను ఫోన్ మాట్లాడటం ఆపేసి, అదే ఫోన్‌తో ఆ పిట్టని ఫోటో తీసుకుని, తిరిగి ఫోన్‌లో మాట్లాడుతూ వడి నడక ప్రారంభించాడు. ప్రస్తుతాన్ని చిత్రాల్లో చెరపట్టి ఆస్వాదన భావికి వాయిదావేసే ఆధునిక భావుకుడు! కాలక్షేపం కట్టిపెట్టి, అతన్నొదిలేసి చుట్టూ పరికించాను - ఆ పరిసరాల్లో అలల్లా తేలుతున్న ఆలోచనల్ని అలవాటుగా పరిశీలిస్తూ, ప్రమాదకరమైనవేమన్నా ఉన్నాయేమోనని అలవోకగా పరీక్షిస్తూ. నగరంలో నలుగురూ చేరే ప్రముఖ ప్రదేశాల్లో స్కానింగ్ చెయ్యటం నా బాధ్యత. సిటీ నడిబొడ్డునున్న పార్కులో, సదా రద్దీగా ఉండే కాఫీ షాపు ముందు అదే పనిలో ఉన్నానిప్పుడు. షాపు ముందు పచ్చటి పచ్చిక బయలు. దాని మీద పాతిక దాకా టేబుళ్లు. వాటి చుట్టూ ముసిరిన జనం. వాళ్ల నీడలు సాయంత్రపు నీరెండలో సాగిపోయి నాట్యమాడుతున్నాయి. వాతావరణం వందలాది ఆలోచనల్తో, వాటినుండి విడుదలైన భావాలతో కంగాళీగా ఉంది. ఆవేశం, ఆక్రోశం, అవమానం, అనుమానం, అసూయ, అపనమ్మకం మొదలైన ప్రతికూల భావనలదే మెజారిటీ. అదేంటోగానీ, మనుషులకి ఆనందం పొందటానికంటే ఆవేదన చెందటానికి, అసంతృప్తిగా ఉండటానికే ఎక్కువ కారణాలు దొరుకుతాయి! అదిగదిగో, అక్కడో అమాయకత్వం, ఇక్కడో అల్పానందం కూడా బిక్కుబిక్కుమంటున్నాయి. ఇవి కాదు నాక్కావలసింది, ఇంతకన్నా ముఖ్యమైనవి - అమానుషమైనవి. అదేంటక్కడ ... ఆత్మహత్య తలపు? పట్టించుకోనవసరం లేదు. ఆ మధ్య టేబుల్ దగ్గరున్నోడి తలని అపరాధపుటాలోచనేదో తొలిచేస్తోంది. అదేంటో చూద్దాం. ఇంకాసేపట్లో భార్యని హత్య చెయ్యటానికి కిరాయి హంతకుడిని పురమాయించి ఎలిబీ కోసం ఇక్కడొచ్చి కూర్చున్న అనుమానపు మొగుడి తలపు. అది వాడి వ్యక్తిగత వ్యవహారం. నాకు సంబంధించింది కాదు. ఇలాంటివాటిలో కలగజేసుకుని జరగబోయే నేరాన్ని ఆపాలనే ఉంటుంది. కానీ ఏజెన్సీ ఒప్పుకోదు. పావుగంట పైగా స్కాన్ చేసినా కలవరపెట్టే ఆలోచనలేవీ కనబడలేదు. అక్కడ రకరకాల మనుషులున్నారు. దాదాపు అందరూ మొబైల్ ఫోన్లలోనూ, టాబ్లెట్లలోనూ ముఖాలు దూర్చేసి ఉన్నారు. పొరుగింటి మనుషుల్ని పలకరించే ఆసక్తి లేకున్నా ముఖపరిచయం లేని మిత్రుల రోజువారీ ముచ్చట్లు మాత్రం క్రమం తప్పక తెలుసుకునేవాళ్లు. అన్ని సమయాల్లోనూ అన్ని విషయాలతోనూ కనెక్టెడ్‌గా ఉండే తహతహతో చుట్టూ ఉన్న ప్రపంచం నుండి డిస్కనెక్ట్ అయిపోయినోళ్లు. ఇ-మెయిళ్లు, ఎస్సెమ్మెస్‌లు, పోస్ట్‌లు, లైక్‌లు, పోక్‌లు, ఫోటోలు, వీడియోలు, ట్వీట్‌లు, ట్యాగ్‌లు, డౌన్‌లోడ్‌లు, అప్‌లోడ్‌లు, యాప్స్, గేమ్స్, ఫీడ్స్ ... కిందటి తరం వినైనా ఎరగని విశేషాల్లో, విషాల్లో నిండా మునిగిన జనం. వాస్తవలోకాన్నొదిలేసి ‌సైబర్ వాస్తవంలో ముసుగులు కప్పుకు సంచరించే వెర్రితనం. ముగుసులు. లేనిదెక్కడ? ఇంటర్నెట్‌లోనే కాదు, ఈ లోకం నిండా ఉందీ ముసుగు మనుషులే. అందరు మనుషులకీ అవతలి వ్యక్తి ముసుగు తొలగించి, వాడి మదిలో మెదిలే వికృతాలోచనల్ని చదివే శక్తి ఉంటే? అప్పుడిక ప్రపంచంలో రహస్యాలుండవు. మోసాలుండవు. ఇన్ని నేరాలుండవు. కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండవు. మాటతో పనుండదు. పిల్లల మనసెరగని తల్లిదండ్రులుండరు. తలలో పుట్టే తలపులకి మరుగన్నది లేనినాడు భయంతోనో, సిగ్గుతోనో వాటిని నియంత్రించటం మనుషులు నేర్చుకుంటారు. మెరుగుపడతారు. ప్రపంచానికిక నాలాంటివారితో పనుండదు. నా శక్తికేం ప్రత్యేకతుండదు. శక్తి. ఈ శక్తి నాకెందుకొచ్చిందో తెలీదు. ఎప్పుడొచ్చిందో మాత్రం లీలగా గుర్తుంది. మొట్టమొదటిసారి నేను చదివింది అమ్మ ఆలోచనల్ని. అప్పుడు నాకు ఐదేళ్లుంటాయి. ఆలోచనల్ని చదవటం అనేదొక అద్భుతమైన విషయమని తెలీని వయసు. యథాలాపంగా అమ్మ మనసులో ఏముందో చదివేసి బయటకు చెప్పేయటం, దానికామె ఆశ్చర్యపడిపోవటం, మళ్లీ చదవమనటం, నేను మరోమారామెని ఆశ్చర్యపరచటం, ఆ సాయంత్రం అంతా ఇద్దరం అదే పనిలో ఉండటం ... ఇంతే గుర్తుంది. ఆ వయసులో నాకదొక ఆటలా మాత్రమే తోచింది. తర్వాత మరి కొన్నిసార్లూ అమ్మ ఆలోచనలు చదివి చెప్పాను. అయితే, ఆమె మొదట్లో చూపించిన ఆసక్తి తర్వాత చూపకపోగా చిరాకుపడింది. నేను చిన్నబుచ్చుకున్నాను. ఎందుకో బోధపడకపోయినా, ఆమె ఆలోచనలు నేనలా చదివేయటం అమ్మకి ఇష్టంలేదని అర్థమయింది. దాంతో ఆమె దగ్గర నా శక్తి ప్రదర్శించటం మానేశాను. మొదట్లో అనుమానించినా, మెల్లమెల్లగా ఆమె కూడా నాకా శక్తి ఎంత చిత్రంగా వచ్చిందో అంత చిత్రంగానూ మాయమైపోయిందనుకుని కాలక్రమంలో ఆ విషయం మర్చిపోయింది. అమ్మకి తెలీని సంగతేంటంటే - నా శక్తి రోజు రోజుకీ పెరిగిపోసాగింది. మొదట్లో ఆమెని మాత్రమే చదవగలిగిన నేను, కాలం గడిచే కొద్దీ ఇతరులనీ చదివేయసాగాను. అతి సమీపంలో ఉన్నవారి నుండి రెండు వందల మీటర్ల రేడియస్‌లో ఉన్న ప్రతి మనిషినీ చదవగలిగేవరకూ నా పరిధి విస్తరించింది. అందరిని చదవటం వల్లనో ఏమో, నాకు వయసుకి మించిన పరిపక్వత అబ్బింది. ఏడేళ్లొచ్చేటప్పటికే ఓ విషయం అర్థమైపోయింది: పరాయి వ్యక్తి తన మస్తిష్కంలోకి చొరబడి అందులో ఏముందో కనిపెట్టేయటం ఏ మనిషీ ఇష్టపడడు. మరి నాకీ శక్తున్న విషయం అందరికీ తెలిసిపోతే? ఇక నన్నెవరూ మనిషిలా చూడరు. నేనంటే భయమే తప్ప ఇష్టం, ప్రేమ ఎవరికీ ఉండవు. ఆ ఆలోచన భరించలేకపోయేవాడిని. అందువల్ల నా వింత శక్తి సంగతి ఎవరికీ తెలియకుండా దాచాలని నిర్ణయించుకున్నాను. దానికోసం చాలా కష్టపడాల్సొచ్చింది. నలుగురిలోకీ వెళ్లటం ఆలస్యం - అన్ని దిక్కులనుండీ ఆలోచనలు కమ్ముకునేవి. కళ్లు మూసుకుంటే లోకాన్ని చూడకుండా ఉండొచ్చుగానీ దాన్ని వినకుండా ఉండలేం. నా వరకూ పరుల ఆలోచనలూ అంతే. వద్దన్నా వచ్చేసి మనోఫలకంపై వాలతాయి. వాటిని ఆపటం నా చేతిలో లేదు. వేలాది జోరీగలు చుట్టుముట్టినట్లు ఒకటే రొద. తల దిమ్మెక్కిపోయేది. తప్పించుకోటానికి ఒకే దారి కనపడింది. ఆ జోరీగల్లో ఒకదాన్నెంచుకుని దాని మీదనే ఫోకస్ చేసేవాడిని. తక్కినవి నేపథ్యంలోకెళ్లి రొదపెట్టేవి. గుడ్డిలో మెల్లగా ఉండేది. అలా, టీనేజ్‌కొచ్చేసరికి వేల మనసులు చదివేశాను. ఆ క్రమంలో‌ నాకో గొప్ప సత్యం బోధపడింది. కనిపించేదంతా మిథ్య. కనిపించనిదే నిజం. అది ఎవరికీ నచ్చదు. అందుకే ఈ నాటకాలు, బూటకాలు. కని పెంచిన ప్రేమలో ఉండేదీ 'నా' అనే స్వార్థమే. స్వచ్ఛమైన ప్రేమ లేనే లేదు. అదుంటే కవిత్వంతో పనుండేది కాదు. పైకి మామూలుగా కనపడే ప్రతి వ్యక్తి లోపలా పూర్తి భిన్నమైన మరో వ్యక్తి దాగుంటాడు. వాడి ఆలోచనలు అనంతం. చేతలు అనూహ్యం. ఆ పుర్రెలో ఎప్పుడు ఏ బుద్ధి ఎందుకు పుడుతుందో వివరించటం అసాధ్యం. మనిషి కళ్లకి కనిపించే విశ్వం - పొడవు, వెడల్పు, లోతు, కాలాలనే పరిధుల మధ్య గిరిగీసి బంధించబడ్డ మరుగుజ్జు లోకమైతే, ఆ పరిధులకవతలుంది మరోప్రపంచం. అది మంచికీ చెడుకీ మధ్య, నలుపుకీ తెలుపుకీ నడుమ, మానవ మస్తిష్కంలో కొలువైన అవధుల్లేని ఊహాలోకం. దాని లోతు కొలవటానికి కాంతి సంవత్సరాలు చాలవు. ఆ చీకటి లోకాల్లోకి నేను తొంగి చూశాను. పువ్వుల్లా విచ్చుకు నవ్వే వదనాల వెనక నక్కిన గాజు ముళ్లు. ఎంత తరచి చూస్తే అంత లోతుగా చీరేసేవి. ఆ బాధ పైకి కనపడకుండా తొక్కిపట్టటమో నరకం. అదో నిరంతర సంఘర్షణ. దాని ధాటికి స్థితిభ్రాంతికి లోనయ్యేవాడిని. చిన్న చిన్న విషయాలు మర్చిపోయేవాడిని. వేర్వేరు సంఘటనల్ని కలగలిపేసి గందరగోళపడిపోయేవాడిని. అయితే వాటిని మించిన సమస్య వేరే ఉంది. తండ్రి లేకుండా పెరగటాన, అమ్మకి నేనొక్కడినే కావటాన, ఒంటరి నడకలో అలుపెంతో నాకు తెలుసు. 'నా వాళ్లు' అనే మాట విలువెంతో మరింత బాగా తెలుసు. కానీ నా శక్తి పుణ్యాన, నా వాళ్లనుకునేవాళ్లంతా లోలోపల నన్నేమనుకుంటున్నారో గ్రహించాక వాళ్లతో అంతకు ముందులా ఉండలేకపోయేవాడిని. ఈ లోకంలో నేనో ఏకాకిగా మిగిలిపోతానేమోననే భయం వెంటాడేది. దానికి విరుగుడుగా - నా వాళ్ల ఆలోచనలు పొరపాటున కూడా చదవకూడదనే నిర్ణయం పుట్టింది. వద్దనుకున్నవారి ఆలోచనల్ని వదిలేయగలిగే నిగ్రహం సాధించటానికి కిందామీదా పడ్డాను. కానీ చివరికి సాధించాను. నా వైట్ లిస్ట్‌లో అతి కొద్ది పేర్లే ఉండేవి. వాటిలో ఒకటి షాహిదా. తను ఇంజనీరింగ్‌లో నా సహచరి. చూపులు కలిసిన తొలిసారే మా మధ్య ఆకర్షణేదో మొగ్గతొడిగింది. ఆమె ఆలోచనలు చదవకూడదన్న స్థిర నిశ్చయానికి ఆ క్షణమే వచ్చేశాను. పరిచయం ప్రేమగా మారటానికి ఎక్కువరోజులు పట్టలేదు. చదువు పూర్తయ్యాక అమ్మని ఒప్పించి షాహిదాని పెళ్లాడటానికి కాస్త కష్టపడాల్సొచ్చింది. మొదట్లో ఇద్దరి మతాలూ వేరని అమ్మ బెట్టుచేసినా, తర్వాత తనే మెట్టు దిగింది. పెళ్లయ్యాక, అప్పుడప్పుడూ షాహిదా మనసులో ఏముందో చదివి తెలుసుకోవాలన్న కోరిక తలెత్తినా, దాన్ని తొక్కిపట్టేసేవాడిని. అదెంత పెద్ద తప్పో తర్వాతెప్పటికో తెలిసింది. అప్పటికే ఆలస్యమయింది. తల విదిలిస్తూ, స్కానింగ్ కొనసాగించాను. చుట్టూ జనాలు ఎవరి ఆలోచనల్లో వాళ్లు మునిగున్నారు. ఆశలు, అసూయలు, కోరికలు, కోపాలు, వల్గారిటీస్, పెర్వర్షన్స్ అన్నీ వాళ్ల తలపుల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. అవన్నీ నేను వింటున్నానని తెలిస్తే? అప్పుడా ఆలోచనలకి కళ్లాలేస్తారా? నో. నా మీద దాడికొస్తారు. తమ ప్రైవసీ హక్కుకి భంగం కలిగించానంటూ రాద్ధాంతం చేస్తారు. ఈ కారణంగానే ఏజెన్సీ అజ్ఞాతంలో ఉండిపోయింది. ఇందాకెప్పుడో తెచ్చుకున్న కాఫీ చల్లారిపోయింది. మరో కాఫీ కోసం లేచెళ్లి కౌంటర్లో ఆర్డరిచ్చి, అదొచ్చేలోపు ఎదురుగా గోడకున్న టీవీలో స్క్రోలింగ్ న్యూస్ చదవసాగాను. "ప్రత్యేక హోదా సాధించి తీరతాం - చంద్రబాబు". "విదేశాల నుండి నల్ల ధనం వెనక్కి రప్పిస్తాం - నరేంద్రమోదీ". "త్వరలోనే మెగాస్టార్ నూట యాభయ్యో సినిమా ప్రకటన - రామ్ చరణ్". "ఈ దేశంలో పుట్టినోళ్లందరూ జై శ్రీరామ్ అనాల్సిందే - సాధు మహరాజ్". రెండేళ్ల నుండీ రోజు మార్చి రోజు ఇదే బ్రేకింగ్ న్యూస్! కానీ సామూహిక అత్యాచారాలు, సంఘవిద్రోహ చర్యల వార్తల కన్నా ఇవే మెరుగు. కాఫీ వచ్చింది. తీసుకుని వెనక్కొచ్చి ఇందాకటి టేబుల్ వద్దే కూర్చుని తాగబోతోండగా ... తలలో చిన్న మెరుపు మెరిసింది. లిప్తపాటు మెదడు మొద్దుబారింది. సందేశాలు రాబోతున్న సూచన. ఏజెన్సీ నుండి. కాఫీ కప్పు కిందపెట్టి కళ్లు మూసుకున్నాను, అంతఃచక్షువులకి అల్ల్లంత దూరంలో కనబడుతున్న సూక్ష్మబిందువు మీదకి ఫోకస్ లాక్ చేయటానికి ప్రయత్నిస్తూ. కొత్తలో ఈ పని చేయటానికి రెండు నిమిషాల పైగా పట్టేది. ఇప్పుడు రెండే సెకన్లు. ఫోకస్ లాక్ అవగానే సందేశాలు డౌన్‌లోడ్ కావటం మొదలయింది. మొదటగా ఎవరిదో ఫోటో వచ్చింది. అంత స్పష్టంగా లేదు. పురుషాకారం అని మాత్రం తెలుస్తోంది. నాతో సహా ఎవడైనా కావచ్చు. టెలీపతీ ద్వారా శబ్ద సంకేతాలొచ్చినంత స్పష్టంగా చిత్రాలు రావు. ఇంత అస్పష్టమైన ఫోటోలతో ఉపయోగం ఉండదు, కానీ టార్గెట్ ఎలా ఉంటుందో అసలుకే తెలీకపోవటం కన్నా ఇది మెరుగని ఏజెన్సీ వాదన. ఫోటోని పక్కకి నెట్టేసి, తక్కిన సందేశాలని జాగ్రత్తగా విన్నాను. ఏదో రామదండు అట. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను సిద్ధాంతంతో కొత్తగా పుట్టుకొచ్చిన మతోన్మాద మూక! మక్కా మసీదులో పేలుళ్ల పథకం. ముహూర్తం రేపే. దాని సూత్రధారుల పని మిగిలిన ఏజెంట్స్ చూసుకుంటారు. ప్రధాన పాత్రధారి పని మాత్రం నేను పట్టాలి. అందుకు అనువైన స్థలం కూడా సూచించబడింది. ‌ఆ ప్రాంతం నాకు చిరపరిచితమైనదే. అయినా కూడా ఓ సారి ఫోన్‌లో ఆ ప్రాంతానికి సంబంధించిన తాజా మాప్ తెరిచి పరిశీలించాను. నేను చివరిసారిగా అటువైపు వెళ్లి చాన్నాళ్లయింది. ఈ మధ్యకాలంలో అక్కడ ఏమేం మార్పులొచ్చాయో తెలుసుకోవటం అత్యావశ్యకం. మాప్ పని పూర్తయ్యాక మళ్లీ కళ్లు మూసుకుని మిగిలిన వివరాలు విన్నాను. ఆఖర్లో వినపడింది వాడి పేరు. చిరంజీవి.

* * * * * * * *

అరగంటగా అక్కడ కాపుకాస్తున్నాను. తమ అమానుష పథకాన్ని అమలుచేసే క్రమంలో- అర్ధరాత్రి దాటాక చిరంజీవి నగరంలో అడుగుపెడతాడని, ఇదే దారిగుండా తన షెల్టర్‌కి వెళతాడని ఏజెన్సీ పంపిన సందేశం. కచ్చితంగా ఏ వేళకొస్తాడో తెలీదు. ఎంతసేపు నిరీక్షించాలో? అది నగరానికి దూరంగా విసిరేసినట్లున్న పారిశ్రామికవాడ. పగలు హడావిడిగా ఉండే ఆ ప్రాంతం అర్ధరాత్రయ్యేసరికి నిర్మానుష్యంగా మారిపోతుంది. అక్కడక్కడా భవనాలు. వాటి మధ్యగా ఓ డొంకదారి. దాని పక్కనున్న తుప్పలూ పొదలే తప్ప చెట్లూ చేమలూ పెద్దగా లేవు. కొన్ని భవనాల్లో విద్యుద్దీపాలు వెలుగుతున్నాయి. నేనున్న ప్రాంతం మాత్రం చీకట్లో మునిగుంది - మతం చీకటి కమ్మేసిన మనుషుల్ని గుర్తుచేస్తూ. ఏదో ద్విచక్ర వాహనం ఇటుగా వస్తోంది. డుగుడుగు శబ్దం. ఎన్‌ఫీల్డ్. దాని మీద ఒక్కడే ఉన్నాడు. చిరంజీవి? డొంకదారి పక్కనున్న పొదల వెనక నక్కి కూర్చుని స్కానింగ్ మొదలు పెట్టాను. ఊఁహు. చిరంజీవి కాదు. శృంగారతార సినిమా సెకండ్ షోకెళ్లి వస్తున్న రసిక ప్రేక్షకుడు. వాడి ఆలోచనలు అమానుషంగా లేవు. అసహ్యంగా ఉన్నాయి. వాటితో ఎవరికీ ప్రమాదం లేదు. ఉంటేగింటే వాడికే. అది కూడా, వాడి బుర్రలో ప్రస్తుతం ఏముందో చదవగలిగే శక్తి వాడి పెళ్లానికుంటేనే. నన్నెప్పుడూ ఓ సందేహం తొలిచేది. ఈ శక్తి నాకొక్కడికే ఉందా, లేక నా వంటివాళ్లు ఇంకా ఉన్నారా?ఉంటే, వాళ్ల మనసులతో సంభాషించటం సాధ్యమవుతుందా? ఆ ప్రశ్న నన్ను ఎన్నో రోజులు వెంటాడింది. చివరికో రోజు సమాధానం దొరికింది. దానికి నెలముందో దారుణం జరిగింది. ఆ రోజు - అన్నిరోజుల్లాగే నగరమంతటా - నాన్నలు ఆఫీసులకెళ్లారు. అమ్మలు షాపింగ్‌కెళ్లారు. ‌భార్యాభర్తలు సినిమాలకెళ్లారు. పిల్లలు ప్లేగ్రౌండ్స్‌కెళ్లారు. ప్రేమికులు పార్కులకెళ్లారు. వాళ్లలో చాలామంది తిరిగి ఇంటికి రాలేదు. అమ్మ కూడా. ఆ సాయంత్రం ఆమె మందులకోసం మెడికల్ షాపుకెళ్లింది, నాకు కుదరకపోవటంతో. దారిలోనే నకుల్ చాట్ హౌస్. దాన్ని దాటుతూ ఉండగా ఆమె పక్కనే మొదటి బాంబు పేలింది. ఆ తర్వాత పది నిమిషాల వ్యవధిలో నగరంలో వరుసగా మరిన్ని పేలుళ్లు. వందల్లో మృతులు. ఏం పాపం చేశారు వాళ్లు? లోపాలపుట్టలే కావచ్చు. కానీ మనుషులు వాళ్లు. నాలాంటి మనుషులు. బతకటం వాళ్ల హక్కు. దాన్ని లాక్కునేవాళ్లు మనుషులు కారు. నరరూప రాక్షసులు. నరికేయాలి వాళ్లని. ఆవేదనలోంచి ఆవేశం. అందులోంచి ఆలోచన. నా శక్తితో ఏదన్నా చెయ్యలేనా? ఇలాంటివి జరగకుండా ఆపలేనా? బహుశా, నేనిలా ఉండటానికో కారణముందేమో. అది, ఇదేనేమో! ఆ రాత్రి పిచ్చివాడిలా నగరమంతా తిరిగాను. బాంబు పేలిన ప్రతిచోటికీ వెళ్లాను. అన్ని చోట్లా రాక్షస గీతాలాపన. ఏదో చెయ్యాలి. ఈ ఘోరం మళ్లీ జరక్కుండా నా శక్తిని అడ్డేయాలి. కానీ ఎలా? సమాధానం నెల తర్వాత వెదుక్కుంటూ వచ్చింది - ఏజెన్సీ నుండి. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉండే టెలీపతిక్స్ సభ్యులుగా, ప్రభుత్వాల ప్రమేయం లేకుండా నడిచే అజ్ఞాత సంస్థ - ఏజెన్సీ. మైండ్ రీడింగ్ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాల ఆచూకీ పట్టేసి వాటిని నిరోధించటం దాని పని. చాలా రోజులుగా నా మనసుపై నిఘా ఉంచి, నా శక్తిని మంచికోసం వాడాలన్న తపన చూసి, తమలో ఒకరు కమ్మనే ఆహ్వానం పంపింది ఏజెన్సీ. అంగీకరించటానికి అరక్షణం కన్నా ఆలోచించలేదు. ఆనందం. నేను ఒంటరిని కాను. ఉత్పరివర్తనాన్నో, ప్రకృతి వైపరీత్యాన్నో కాను. నాలాంటి వారు మరిందరూ ఉన్నారన్న ఆనందం. అది నాలుగు నిమిషాలే. సభ్యత్వానికి సమ్మతం తెలిపిన వెంటనే ఏజెన్సీ నుండొచ్చిన రెండో సందేశం నన్ను కలవరపరచింది: "నీ భార్య మనసు చదువు". ఎందుకో అర్ధం కాలేదు. అన్యమనస్కంగా, అయిష్టంగా ఆ పని చేశాను. దిగ్భ్రమ! షాహిదాని వైట్ లిస్ట్ చేసి ఎంత తప్పు చేశానో వెంటనే అర్ధమయింది. ఆలస్యం చెయ్యకుండా ఆ తప్పుకి పరిహారం చెల్లించాను. నాటి నుండీ, ఎదురైన ప్రతి వ్యక్తి ఆలోచనలూ చదవసాగాను. ఉగ్రవాద కుట్రల్ని పసిగట్టటం, వాటిని ఏజెన్సీతో పంచుకోవటం, కుదిరితే కుట్రదారుల్ని మట్టుపెట్టటం - ఇదే నా పని. ఆ జాబితాలో ఇప్పటికే ఐదురుగున్నారు. చిరంజీవి ఆరోవాడు. వచ్చేది వాడేనా? రోడ్డు మీద దూరంగా ఏదో ఆకారం, వేగంగా ఇటే నడిచొస్తూ. పొదలమాటున సర్దుక్కూర్చుని స్కానింగ్ మొదలు పెట్టాను. పదే క్షణాల్లో తెలిసిపోయింది. వాడే. వాడి మనసులో - రేపు సాయంత్రం - మక్కా మసీదు - సూసైడ్ బాంబింగ్. నేనుండగా ఆ పథకం అమలయ్యే ప్రసక్తే లేదు. పొదల వెనక పొజిషన్ తీసుకుని సిద్ధంగా ఉన్నాను. వాడు నన్ను దాటి రెండడుగులు వెయ్యగానే వెనకనుండి లంఘించి మీదకి దూకాను. వాడు నేలమీద బోర్లాపడ్డాడు. ఊహించని దాడికి విస్తుపోతూ వెనక్కితిరిగాడు. అంత దగ్గరనుండి మసక వెలుగులోనూ వాడి ముఖం స్పష్టంగా కనబడింది. గెడ్డం పెంచి, మీసాలు తీసేసి, మహమ్మదీయుడిలా అగుపిస్తున్నాడు. మసీదు ముంగిట ఎవరికీ అనుమానం రాకుండా బాగానే వేశావురా మారువేషం! అంతలోనే వాడు నోరు తెరిచాడు. అయోమయం నటిస్తూ అడిగాడు. "కోన్ హే తూ? ఏం కావాలి?". హైదరబాదీ యాస కూడా బాగానే పలికిస్తున్నావురా. కానీ నన్ను ఏమార్చలేవు. "నీ ప్రాణం," అంటూ ఒకచేత్తో వాడిని నేలకేసి తొక్కిపడుతూ రెండో చేత్తో ఆయుధం బయటకి లాగాను. వాడి కళ్లలో అయోమయం స్థానంలో భయం చోటుచేసుకుంది. కీచుగొంతుతో అరుస్తూ నన్ను నెట్టేయబోయాడు. కానీ నా బలం ముందు వాడి శక్తి చాల్లేదు. "దొరికిపోయావు చిరంజీవీ. నీ పథకం పారదిక," అంటూ ఆయుధం పైకెత్తాను. "యే చిరంజీవీ కోన్? నేను రియాజ్ అహ్మద్. ఛోడ్ దే ముజే," అని దీనంగా చూశాడు గింజుకుంటూ. ఒక్క క్షణం ఆగిపోయి వాడి మనసులోకి చూశాను. "నా అబద్ధం నమ్మాడో లేదో. ఇప్పుడేమన్నా తేడావస్తే ప్లానంతా అప్‌సెట్ అవుద్ది," అనుకుంటున్నాడు. ముఖంలో మాత్రం కొట్టొచ్చిన దైన్యం. మృత్యుముఖంలోనూ ఏం నటిస్తున్నావురా! నీ ముందు ఐదుగురిదీ ఇదే తీరు. షాహిదాతో సహా. ఏడాది తర్వాత కూడా ఆమె మాటలు నా జ్ఞాపకాల్లో తాజాగానే ఉన్నాయి. "పోయిన్నెల నకుల్ చాట్ పేలుడులో మీ అమ్మ పోవటమేంటి? ఆ కుట్రలో నా హస్తం ఉండటమేంటి? మన పెళ్లయ్యేనాటికే అత్తయ్య కదల్లేని స్థితిలో మంచాన పడుందని, అదే మంచంలో ఏడాది కిందట పోయిందని ... కైసే భూల్ గయే ఆప్? ఆమె పోయినప్పట్నించీ అదోలా ఉంటే దిగులు పెట్టుకున్నావేమోలే, మెల్లిగా నువ్వే బయట పడతావనుకుని సరిపెట్టుకున్నా. చూడబోతే నీకేదో పిచ్చెక్కినట్టుంది. ఏదేదో ఊహించేసుకుంటున్నావు. నేను జిహాదీనేంటి నాన్సెన్స్! ఐదేళ్లు కలిసి కాపురం చేసినదాన్ని ... మైగాడ్. ఆ కత్తెక్కడిది? ఏం చేస్తున్నావ్ ... స్టాపిట్ ... యా అల్లా... " అదే తన ఆఖరి సంభాషణ. మహానటి. చచ్చేముందూ నిజం ఒప్పుకు చావదే! పైగా నేను పిచ్చివాడినని నన్నే నమ్మించబోయింది. ఈ ఉగ్రవాదులందరికీ ఇదో ఉమ్మడి రోగం. తమ పిచ్చి తామే ఎరగని ఉన్మాదం. బ్లడీ సైకోపాత్స్. వీళ్ల పిచ్చికి ఒకటే మందు. ఎత్తి పట్టుకున్న కత్తి కసిగా కిందకి దిగింది. సూటిగా, లోతుగా చిరంజీవి గుండెలోకి. వాడి కళ్లలో కొడిగడుతున్న వెలుగుని తృప్తిగా చూస్తూండగా ఎందుకో మేధావి మాటలు గుర్తొచ్చాయి. "నువ్వేది నమ్మితే నీకదే నిజం".

(The End)

© All rights reserved


Did you enjoy reading this story? Even you can write such stories, build followers and earn. Click on WRITE below to start.

( )star-unfilled( )star-unfilled( )star-unfilled( )star-unfilled( )star-unfilled
Comments (1)