English
Download App from store
author
బివిడి ప్రసాదరావు
రైటర్, బ్లాగర్, వ్లాగర్ ని. నా బ్లాగు - BVD Prasada Rao Blog (https://bvdprasadarao-pvp.blogspot.com) నా యూట్యూబ్ ఛానల్ - BVD Prasada Rao Vlog (https://youtube.com/బివిడి ప్రసాదరావు)
user
బివిడి ప్రసాదరావు
నిర్ణయము (సరళము కథ)
  239 Views
 
  7 Mins Read
 
  2

నా

కర్థమైపోయింది. నే నిక అడగ నవసరం లేదు. ఆమె వైపు చూశాను. తల దించుకుందామె. "చూడు, మాధవీ, నువ్వు నా క్కొంత వ్యవధి నివ్వాలి. రేపటి వరకయితే చాలు. నా నిర్ణయాన్ని నీకు తెలియచేస్తాను." చెప్పాను. "నిర్ణయమా?" ఆశ్చర్యపోయిందామె. అలా అడుగుతున్నప్పుడు ఆమె నా వైపు చూడలేదు. తల దించుకొనే ఉంది. "ఉఁ. నిర్ణయమంటే, ఈ కేస్ కెలా ట్రీట్ మెంట్ నివ్వాలో అని ..." ఆమె తలెత్తింది. నా వంక చూస్తోంది. "ఈ లోగా మరో డాక్టర్ వద్ద కెళ్లకు, ప్లీజ్" అన్నాను. చెప్పుతోంది మాధవి, నేల చూపు చూస్తూ - "హుఁ, మరొకరి వద్దకు వెళ్లక, నేరుగా మీ వద్దకే నే నెందుకొచ్చానో ..." "నాకు తెలుసు. నే నర్థం చేసుకో గలిగాను." అడ్డుపడి అన్నాను. లేచింది మాధవి. నమస్కరించింది. నేనూ చేతులు జోడించాను. "రేపు ..." "ఇదే వేళకు రా. ఖాళీగా ఉండొచ్చు" చెప్పాను. వెళ్లిపోయింది మాధవి. తను వెళ్లిపోతూ నా వైపు చూసింది. ఆ చూపులో భయం ఉంది. అది నన్నెంతగానో కలవరపరించింది. నేను దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాను. వెళ్లి, తలుపు మూసి వచ్చాను. పెద్ద లైటు వెలిగించాను. మంచం మీద వాలేను. కళ్లు మూసుకున్నా నిద్ర పట్టడం లేదు. మాధవే నా కళ్ల ముందు కదలాడుతోంది. 'పిచ్చి మాధవి ... అమాయకంగా నమ్మి, మోసపోయింది' - మరోసారి ఇలా అనుకున్నాను. అప్పుడే మాధవి మీద చెప్పలేనంత సానుభూతి నాలో ఉద్భవించింది. మాధవినెలా ఈ ఊబిలోనించి తీయాలో నా కర్థం కావడంలేదు. ఆమె కోరినట్లు చెయ్యాలా ... 'ఉహుఁ. నేనలా చెయ్యలేను. అది నా వృత్తి ధర్మం కూడా కాదు' ఆలోచనల వెంట పరుగులు తీస్తున్నాను. నా కే ఆలోచనా నీడ నివ్వడం లేదు. లేచాను. గదిలోనించి బయటికి వచ్చాను. తలుపు తీసుకొని, డిస్పెన్సరీలోకి అడుగు పెట్టాను. లైటు వేసి, బీరువా తెరిచాను. సీసాలోనించి ఒక మందు బిళ్ల తీసుకున్నాను. మళ్లీ నా గదిలోకి వచ్చాను. మందు బిళ్ల వేసుకొని, మంచమెక్కాను. మాధవి నాకు చిన్నప్పటి నించీ తెలుసు. మాధవరావుగారి కుటుంబ డాక్టర్ గా మా నాన్నగారుండేవారు. ఆయన పోయాక ఆ స్థానంలో నేను. మాధవి ఒక్కతే మాధవరావుగారికి సంతానం. మాధవరావుగారు ఒక ప్రభుత్వ కంపెనీలో మెకానికల్ ఇంజనీరు. మాధవి చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన దురదృష్టమంతురాలు. కూతురంటే ప్రాణం మాధవరావుగారికి. తండ్రంటే గౌరవం మాధవికి. తన కిష్టం లేకపోయినా, నా ప్రోత్సాహంతో మాధవిని ఎమ్.బి.బి.యస్.లో జాయిన్ చేశారు మాధవరావుగారు. మాధవి విశాఖపట్నం వెళ్లింది చదువుకని. ప్రస్తుతం రెండో సంవత్సరంలో ఉంది. మాధవి వచ్చిందని తెలిసి, నేను వెళ్లాను, మాధవరావు గారింటికి, ఉదయం. పలకరించారు మాధవరావుగారు, ఎదురు వచ్చి. ఆఫీస్ పనుందని, వెంటనే వెళ్లిపోయారు, మాధవి తన గదిలో ఉందని చెప్పేసి. నే నా గదిలోకి వెళ్లాను. నన్ను చూసి మంచం మీంచి లేచి, నమస్కరించింది మాధవి. చిరునవ్వుతో ఆమె చూపించిన కుర్చీలో కూర్చున్నాను. చదువు విషయాలు అడిగాను. ఆమె చెప్పింది. కాని, నా కెందుకో మాధవిని చూస్తుంటే అదోలా అనిపిస్తుంది ఈ మారు. ఇది వరకు ఆమెలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు కానరావడం లేదు. నాతో చాలా చనువుగా, సరదాగా మాట్లాడే మాధవి, ఇప్పుడు చూచి, తూచి మాట్లాడుతోంది. కారణం తెలీక, ఆశ్చర్యంగా ఉంది నాకు. అదే అడిగాను. చిన్నగా, "మీతో ఒక విషయం మాట్లాడాలనే ఇంత సడన్ గా వచ్చేశాను, డాక్టర్ గారూ" అంది. ఆశ్చర్యపోయాను. ఆత్రంగా అడిగాను, "చెప్పు" "ఇప్పుడు కాదు, తర్వాత, మీ ఇంటికి వస్తాను" అంది. "సరే, కానిప్పుడు ..." "ఇక్కడ చెప్పడానికి నా మనస్సంగీకరించడం లేదు. ఆరు, ఏడు ప్రాంతంలో వస్తాను. ప్లీజ్" చెప్పింది మాధవి. కొంతసేపు ఉండి, ఇంటికి వచ్చేశాను. మాధవి గురించి అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను. ఆమె ఏం చెప్పాలను కుంటోంది ... నాతో చెప్పే ఆ రహస్య మేమిటి ... డిస్పెన్సరీ మూసేసి, స్నానం చేసి, గదిలో కూర్చున్నాను. మాధవి కోసమే ఎదురు చూస్తున్నాను. ఆరూ పదవుతోంది. బయట కారాగిన శబ్దం. తలుపు చప్పుడయింది. లేచి వెళ్లాను. నాకు తెలుసు, ఆ వచ్చింది మాధవని. ఇద్దరం నా గదిలో ఎదురెదురుగా కూర్చున్నాం, కుర్చీలలో. "ఏం చెప్పాలనుకుంటున్నావు మాధవీ" అడిగాను ఆత్రాన్ని పట్టలేక. మాధవి చాలాసేపు మౌనంగా ఉండి పోయింది నేల చూపు చూస్తూ. మళ్లీ అడిగాను. చుట్టూ చూసింది మాధవి. "చెప్పు, ఫర్వాలేదు. ఇక్కడ ఉన్నది మనిద్దరమే" నా వైపు ఒకసారి చూసి, అంతలోనే తల దించేసుకొని, చేతి గోళ్లకేసి చూసు కొంటూ, "నన్ను ... నన్ను రక్షించండి డాక్టర్ గారూ" అంది. ఆ వెంటనే, ఆమె గొంతు బొంగురుపోయింది. నా కే మాత్రం మాధవి మనస్సర్థం కావడం లేదు. "సరిగ్గా అర్థమయేట్టు చెప్పు మాధవీ" అన్నాను సాధ్యమైనంత సహనంగా. తలెత్తి చూసింది. ఆమె కళ్లలో నీరు ... "ఏడుస్తున్నావా ... ఎందుకు ... ఏమైంది మాధవీ" మౌనంగా తల దించుకుంది. "చెప్పు మాధవీ ... ధైర్యంగా చెప్పు. నాకు చేతనైన సాయం చేస్తాను. సరేనా" ఆమె ఏమీ చెప్పడంలేదు ఇంకా. మళ్లీ అనునయంగా అడిగాను, "చెప్పు. నన్ను నమ్ముకు వచ్చావు. నన్ను నమ్ము. చెప్పు, ప్లీజ్" చెప్పింది మాధవి, "నే నిప్పుడు ... ఉఁ ... ఉహుఁ ... నా కిప్పుడు ... నెల తప్పింది ..." నాకు షాక్ తగిలినట్టయింది. ఆ షాక్ నుంచి వెంటనే తేరుకో లేకపోయాను. నా గొంతు తడారిపోయింది. నోట మాట రావడం లేదు. ఆమె వైపు చూస్తున్నాను. మాధవి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏమనాలో, ఏం చెయ్యాలో నాకు బోధపడడడం లేదు. దించిన తల ఎత్తకుండానే, హేండ్ బాగ్ లోంచి కొంత డబ్బు తీసి, నా కందిస్తూ, "నన్నెలాగైనా రక్షించండి, డాక్టర్ గారూ" అంది మాధవి. ఏమనలేకపోయాను. మౌనంగా ఉండిపోయాను. మాధవి అనుమానంగా నా వైపు చూసింది. "ధైర్యంగా ఉండు. వివరంగా నా కన్ని విషయాలు చెప్పు. ముందు ఆ డబ్బు బాగ్ లో పెట్టుకో. ప్లీజ్" - ఇంతకన్నా ఏమీ అనలేకపోయాను. నా మాట వింది మాధవి. అంతలోనే, ఆమెకు ఎక్కిళ్లు వచ్చాయి. వెళ్లి, కూజాలో నీరు గ్లాస్ లో పోసుకు వచ్చాను. గ్లాస్ ఆమె కందిస్తూ, "కన్నీళ్లు తుడుచుకో. కుదుటపడు" అన్నాను. ఖాళీ గ్లాస్ కింద పెట్టేసి, చీర కొంగుతో కళ్లు ఒత్తుకుంది మాధవి. నే నడిగాను, "ఏమిటిదంతా ... ఇందుక్కారకులు ఎవరు" ఆగి, చెప్పింది మాధవి, "మా మాస్టారు రాజారావుగారు" "ఈ విషయం చెప్పావా అతనికి" "ఉఁ, చెప్పాను" "ఏమంటున్నారు" "అతని కిది వరకే పెళ్లయ్యింది" చెప్పింది మాధవి. ఉలిక్కిపడ్డాన్నేను. "ఆ విషయం నీకు ఎప్పుడు తెలిసింది" వెంటనే అడిగాను. "మొదట్లోనే" భయంగా చెప్పింది మాధవి. నాలో ఒక్కసారి మాధవి మీద ఏవగింపు పుట్టుకు వచ్చింది. "అన్నీ తెలిసి కూడా ... " "పొరపాటు చేశాను ... నన్ను కాపాడండి, డాక్టర్ గారు." అని, వెంటనే, "తిరిగి ఏ తప్పులూ చేయను" అంది మాధవి. "హుఁ. ఇది మీ ఫాదర్ కు తెలుసా" అడిగాను. "తెలీదు. ఎలా చెప్పేది. అదికాక, ఆయన సంగతి మీకు తెలుసుగా ..." నిజమే, మాధవరావుగారు హార్ట్ పేషెంట్. అతనిని ఇంత వరకు బతికిస్తున్నవి మందులు. వాటికి తోడు తన కన్న కూతురు మీద అనురాగం ... "నన్నిప్పుడేం చెయ్యమంటావ్" విసురుగా అడిగాను. బెదురుగా నా కళ్లలోకి చూసింది మాధవి. "ఎబార్షన్ చెయ్యండి, ప్లీజ్" అగి, మెల్లిగా అంది. నేను ముందే ఊహించాను. నాతో ఈ విషయం చెప్పుతుందంటే, ఆమె మనసులో మాటను నే నర్థం చేసుకోగలిగాను. వెంటనే ఏ నిర్ణయాన్ని తీసుకోలేక పోయాన్నేను. అందుకే కొంత వ్యవధి నిమ్మనమన్నాను. ఆలోచిస్తున్నాను. ఆలోచన వెంట ఆలోచన. ఒక ఆలోచన నన్నాకట్టుకుంది, చివరికి. అది నా నిర్ణయంగా మారింది. ఆ నిర్ణయం వెనుక నా స్వార్థం ఉందని నాకు తెలుసు ... అయినా, నే నా నిర్ణయానికే తల వంచేశాను. బాబాగారి భజన ముగిసింది. స్వామిగారి వద్ద సెలవు కోరి, ఇంటి మొహం పట్టాను, స్కూటర్ మీద. అప్పటికి పది నిముషాలు తక్కువ ఆరయింది. మాధవి వస్తోంది. ప్రతి లక్ష్మివారం సాయంకాలం స్వామిగారింటిలో బాబాగారి భజన అవుతుంటుంది. బాబాగారు నా దైవం. ప్రతి భజనకు నేను హాజరవుతుంటాను. నాకు పాటలు రావు, కీర్తనలు రావు. స్కూటర్ ను ఇంటి వరండాలో పెట్టేసి, తాళాలు తీసుకొని లోనికి వెళ్లాను. బయట కారాగిన శబ్దం. మాధవి వచ్చింది. గబగబా బాత్ రూమ్ లోకి వెళ్లి, మొహం కడుక్కుంటున్నాను, మాధవిని నా గదిలో కూర్చోమని చెప్పి. తను ఎదురుగా నేను కూర్చోగానే, మాధవి నన్నడిగిన మొదటి ప్రశ్న : "ఏమాలోచించారు, డాక్టర్ గారూ" ఆ గొంతులో ఆత్రుత, భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తూంటే, అభిమానం లీలగా అగుపిస్తూంది. "నాన్నగారు ఉన్నారా" నే నడిగాను. ఉలిక్కి పడింది మాధవి. నా కళ్లలోకి చూచింది. "లేరు" పొడిగా అంది. "క్యాంప్ వెళ్లారా" "ఉఁ. రేపొస్తారు" లోగొంతులో చెప్పింది. "నాన్నగా రెందుకు" మళ్లీ వెంటనే అడిగింది. నేను సమాధాన మివ్వక ఊరుకున్నాను, కొన్ని క్షణాలపాటు. "మాధవీ" పిలిచాను. తలెత్తింది. "పెళ్లి చేసుకోకూడదూ" సూటిగా ఆమె వైపు చూస్తూ అడిగాను. క్షణ మాగి, తేరుకుంటూ, "ఆ ఆలోచన అప్రస్తుత మనుకుంటానండీ" అంది మాధవి. "ఉహుఁ. ప్రస్తుతానికే - నే నా ఆలోచన చేశాను" చెప్పాను. మౌనంగా తల దించుకుంది మాధవి. మళ్లీ అడిగాను. "నా విషయాన్ని తెలియనీయకుండా, మోసం చేసి, నేను పెళ్లి చేసుకోలేను ... తెలిసి నన్నెవరూ పెళ్లి చేసుకోరు" "నేను చేసుకుంటాను" చెప్పాను, వెంటనే. దీనికి ఆమె నించి రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని గబగబా ఆమె చూపుల్లోకి చూశాను. చూపులు మరల్చుకుంది మాధవి. "నీ కిష్టమేనా" అడిగేశాను. "డాక్టర్ గారూ" - గాభరా పడుతోంది మాధవి. "నిజం. అవును మాధవీ, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ... ఇంతకంటే, నా నించి నీకు సహాయం లభించదు" అన్నాను గబగబా. నా కళ్లల్లోకి చూస్తూ ఉండిపోయింది మాధవి. ఆ చూపుల్లో ఎన్నోఆకారాలు లేని భావాలు నా క్కనిపిస్తున్నాయి ... "ఏమాలోచించకు మాధవీ. ఇదే సరైనది" అన్నాను. మాధవి ఇంకేమీ చెప్పడం లేదు. "ఏమంటావు మాధవీ. నేనంటే నీ కిష్టమేనా?" "మీ మంచితనం అంటే నా కిష్టం" "థాంక్స్ మాధవీ ... థాంక్స్" అంతలోనే బయట నించి ఎవరో నన్ను పిలుస్తున్నట్టయింది. బయటకు వెళ్లాను. ఎవరో ఒక రోగిని తీసుకు వచ్చారు. వారిని డిస్పెన్సరీలో కూర్చుండ పెట్టి, మాధవి దగ్గరకు వచ్చాను. మాధవి ఏడుస్తోంది. నా కెందుకో అయోమయంగా తోచింది. "మాధవీ, ఏడుస్తున్నావా ... ఏం, ఎందుకు" అడిగాను. జవాబు ఇవ్వక మౌనంగా తలెత్తింది. "ఆనందమా ... ఈ ఆనందం నీ ఒక్కరికే కాదు ... నా క్కూడా. వెళ్లు ఇంటికి. నిశ్చంతగా ఉండు. రేపు ఉదయాన్నే మీ నాన్నగారి వద్దకు వస్తాను. మన పెళ్లి విషయాన్ని మాట్లాడతాను. అతను కూడా అప్పుడప్పుడూ నన్ను తన అల్లుడుగా ట్రీట్ చేస్తూ మాట్లాడేవారు. అప్పుడన్నది సరదాకైనా, ఇప్పుడు దాన్నే నిజం చేయమని కోరుకుంటాను ... ధైర్యంగా వెళ్లు ... నీ విషయం, మనం ఏమీ అతనికి చెప్పక్కరలేదు ... ఒక కేస్ చూడాలి. సో, బైబై" . అన్నాను. మాధవిని మరేమీ మాట్లాడనీయలేదు నేను. నేరుగా ఆమెను కారు వరకు నడిపించుకుంటూ వెళ్లాను. వచ్చిన రోగిని పంపించేసి, భోజనం చేసి, నా గదిలోకి వచ్చేసరికి పావు తక్కువ తొమ్మిదయింది. మంచం మీద వాలేను. మాధవి ఇంత సులభంగా ఆంగీకరిస్తుందని నే ననుకోలేదు. మాధవి గురించి ఆలోచిస్తుంటే - శ్యామల గుర్తుకు వచ్చింది. చివుక్కున లేచి, టేబులు ముందుకు వెళ్లాను. డ్రాయర్ లోనించి పాత డైరీలను తీశాను. నాకు కావలసిన డైరీ ఏరుకున్నాను. ఇది - నేను ఎమ్.బి.బి.యస్. నాలుగో సంవత్సరంలో ఉన్నప్పుడుది ... గబగబా పేజీలు తిరగవేశాను. మే, 15 పేజీ తీశాను. నేనీ తేదీని మర్చిపోలేను. ఇది - నా పుట్టిన రోజు ... పైగా, నే నెప్పుడూ ఊహించని ఒక 'నిజం' బయట పడిన రోజు ... అందుకే ఈ రోజంటే నాకు బాగా గుర్తు ... చాలా భయం ... ఈ పేజీలో ఇలా వ్రాసుకున్నాను ... 'శ్యామల గర్భవతి. కారకుణ్ణి నేను కాదు. నాలో దాగి ఉన్న పెద్ద లోపం తెలిసిన రోజిది. నన్ను పాతాళలోకం లోకి కూల్చేసిన రోజిది' నిజమే ... ఆ విషయం తెలిసిన క్షణంలో నే నెంతగానే బాధ పడ్డాను. భయ పడ్డాను. ఏడ్చాను. పిచ్చిగా నవ్వుకున్నాను. మళ్లీ, మళ్లీ కుమిలి, కుమిలి ఏడ్చాను. ఆ విషయాన్ని మీకు తెలియపరిస్తే శ్యామల విషయంతో పాటు, మాధవిని నేను పెళ్లి చేసుకోవాలను కోవడంలో గల నా స్వార్థం కూడా మీకు తెలుస్తుంది. శ్యామల మా క్లాస్ మేట్. ఆ రోజు శ్యామల పుట్టిన రోజు. స్నేహితుల్ని హోటల్ కి పిలిచింది పార్టీకి. పార్టీ అయిపోయిన తర్వాత, నన్నూ, గిరిని ఉండమని చెప్పి, మిగిలిన వారిని సాగనంపేసింది శ్యామల, చిరునవ్వుతో. అందరూ వెళ్లిపోయిన తర్వాత, మిగిలిన మా ఇద్దరితో, మా ప్రోత్సాహంతో, 'మందు' పుచ్చుకుంది శ్యామల. మా పార్టీ చాలా జోరుగా సాగిపోతోంది ... మేము బాగా తాగేస్తున్నాం ... ఆ మర్నాడు, ఉదయాన్నే పిడుగు లాంటి వార్త చెప్పింది శ్యామల, ఏడుపు మొహంతో. నే నప్పుడే లేచాను. అప్పటికే గిరి లేచి ఉన్నాడు. "ఛీ ... ఛీ. మీ రిలాంటి వాళ్లని నే ననుకోలేదు. మీ రంత పని చేస్తారంటే, ఈ పార్టీకి నే నంగీకరించక పోయేదాన్ని" - ఏడుస్తోంది శ్యామల. "అర్థమైనట్టు చెప్పు శ్యామలా" అన్నాన్నేను. "హుఁ. ఏం, నీ కర్థం కావడం లేదా ... రాత్రి ... ఏం చేశారు ... నా జీవితంతో మీ రాటలాడుకోలేదూ ... ఛీ ఛీ ... ఏం గిరీ, నువ్వు కూడా ఎలా నన్ను అనుభవించావ్ ... 'చెల్లాయి ... చెల్లాయి' అంటూ నన్ను పిలుస్తూ కూడా ..." "శ్యామలా" అరిచాన్నేను. నా కర్థమైపోయింది ... "ఏ మలా అరుస్తున్నావ్ కృపాకర్. నువ్వు, గిరీ ఇలా నన్ను మోసం చేస్తారని నే నెప్పుడూ అనుకోలేదు ... మీరు ... మీ ఇద్దరూ ..." అరుస్తోంది శ్యామల పిచ్చిదానిలా. బలవంతంగా ఆమెను పట్టుకు ఆపాను. "ప్లీజ్, శ్యామలా. ప్లీజ్. ఆవేశపడకు ... ఇందులో నా నేరమేమీ లేదు. నా మాట విను." అంటున్నాన్నేను. "నా తప్పుకూడా ఏమీ లేదు శ్యామలా" గిరి అంటున్నాడు. "నువ్వు .... నువ్వు ... కాకపోతే ... మరెవరై ఉంటారు ... గడియ వేసిన ఈ గదిలోకి ... మరెవరు వచ్చి, మీ చెంత నన్ను... వివస్త్ర ..." - శ్యామల ఏడుస్తోంది. ఇద్దరం తలలు దించుకున్నాం. శ్యామల వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. నేను మాత్రం కాదు ... నా కా నిజం తెలుసు ... మరి! ... గిరే కావచ్చు ... అదే వాడి నడిగాను సూటగా. వాడూ కాదంటున్నాడు ... నా కంతా అయోమయంగా ఉంది ... చివరికి, నా కో ఆలోచన తట్టింది. అది శ్యామలకు చెప్పాను. ఆమె ఒప్పుకోలేదు ... మొండిగా నిజం ఒప్పుకోమంటుంది ... గిరి కూడా వెనుకడుగు వేశాడు! నిజం నాకు బోధపడిపోయింది. అయినా, అది శ్యామలకు తెలిసి రావాలి. అందుకే, ఎంతో ప్రయత్నం మీద శ్యామలను ఒప్పించాను. ఆ రోజు ఒక హాస్పిటల్ కెళ్లాం, ముగ్గురం. లేడీ డాక్టర్ శ్యామలను పరీక్ష చేసింది. మరో డాక్టర్ నన్ను, గిరిని పరీక్షించారు. మా 'స్పెర్మ్' రిపోర్టులు లేడీ డాక్టర్ కు అందించారు, మా డాక్టర్ గారు. శ్యామల నుండి లభించిన 'స్పెర్మ్' - గిరి దానితో సరిపోయింది. దొంగ దొరికిపోయాడు. శ్యామల 'క్షమించ'మని నన్ను కోరింది. తర్వాత - తర్జనభర్జనల తర్వాత - చివరికి, శ్యామల, గిరి 'పెళ్లి' చేసుకోవడానికే మొగ్గు చూపారు. వాళ్లిద్దరూ నా కళ్ల ముందే చేతులు కలుపుకున్నారు ... ఉంగరాలు మార్చుకున్నారు. కాని, నా కళ్లల్లో నీళ్లు ఇంకడం లేదు ... నా 'విషయం' తెలిసినప్పటి నుండి నాకు కుదురు చిక్కడం లేదు ... ఆ రోజే తెలిసింది ఆ నిజం ... నన్ను నిలువునా వణికించింది ... నాది 'డెమ్మీ స్పెర్మ్' అని బయట పడింది ... ఈ విషయాన్ని ఇన్నాళ్లూ నా వాళ్లకు చెప్పక, నా మూలంగా ఒక 'ఆడది' నాశనం కాకూడదని, నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకుండా, తప్పించుకొంటూ వస్తున్నాను ... ఇప్పడు నా జీవితంలో, వెలుగురేఖలా మాధవి ప్రవేశించబోతోంది ... ఆమె గర్భవతి ... ఆమె మగ బిడ్డను కన్నా, ఆడ బిడ్డను కన్నా ... అదే ఆమె చివరి సంతానం ... ఫర్వాలేదు, నే నెవరికైనా తండ్రిగా అవుతాను ... ఆ తృప్తి నాకు చాలు ... ఆ ఆనందం నాకు చాలు ... ఇది మా ఇద్దరి మధ్యే ఉండిపోయేలా చూస్తాను ... అంతే. హాయిగా ఊపిరి పీల్చుకున్నాను ... మాధవి నాన్నగారితో కబురు చెప్పేసిన వెంటనే, మా వాళ్లతో 'నేను పెళ్లిచేసుకుంటున్నాన'ని చెప్పేస్తాను ... ఈ సంవత్సరం డైరీలో, ఈ రోజు పేజీలో, ఇలా వ్రాసుకున్నాను - 'నేనూ మగవాడినే. నాకూ పెళ్లవుతుంది. నేనూ తండ్రి నవుతున్నాను ...' గత రాత్రి నా డైరీలో వ్రాసుకున్న పేజీకి, ప్రక్క పేజీలోనే, నే నిలా వ్రాసుకోవలసి వస్తుందని నే ననుకోలేదు - 'మాధవి తన మాస్టారు రాజారావుగారినే, ఎలాగైనా పెళ్లి చేసుకుంటానని పట్టు పట్టి, తన తండ్రిని ఒప్పించుకో గలిగింది. కొంత విచారం గానే ఈ విషయాన్ని నాకు మాధవరావుగారు చెప్పారు' మాధవి ఎందుకీ నిర్ణయాన్ని తీసుకుంది ... నన్నూ ఈ ప్రశ్న మొదట కలవర పరిచింది. తర్వాత దీనికి జవాబు, మాధవి ద్వారా తెలుసుకున్నాను. కొంత కుదుట పడ్డాను. నిజమే, మాధవి తన బిడ్డకు తండ్రిగా నన్నెలా చూపగలదు ... తన ముందే నన్ను ఆ బిడ్డ 'నాన్నా' అని పిలుస్తుంటే, ఆమె ఎలా వోర్వగలదు ... ఎలా సహించగలదు ... ఎలా కుదుట పడగలదు ... డైరీలో మళ్లీ ఇలా వ్రాసుకున్నాను - 'నేను డాక్టర్ని, శారీరక వ్యాధులకు ... మానసిక వ్యాధులకు తగిన వాడిని కాన్నేను, అని తెలుసుకున్న రోజిది ...' ***

© All rights reserved


Did you enjoy reading this story? Even you can write such stories, build followers and earn. Click on WRITE below to start.

(*)star-filled(*)star-filled(*)star-filled(*)star-filled(*)star-filled
Comments (2)