English
Download App from store
author
బివిడి ప్రసాదరావు
రైటర్, బ్లాగర్, వ్లాగర్ ని. నా బ్లాగు - BVD Prasada Rao Blog (https://bvdprasadarao-pvp.blogspot.com) నా యూట్యూబ్ ఛానల్ - BVD Prasada Rao Vlog (https://youtube.com/బివిడి ప్రసాదరావు)
user
బివిడి ప్రసాదరావు
భారతీ గర్వించు నీ బిడ్డను చూసి (సరళము కథ)
  166 Views
 
  6 Mins Read
 
  3

"స

ర్లే బాబూ, మాటలకేం గానీ, బుధవారం నాటికి వచ్చేస్తానని చెప్పి ఇప్పుడా రావడం?!" "నాలుగు రోజులేగా ... వెళ్లగానే జాబ్ లో చేరాను. తరవాత అద్దె ఇల్లు కోసం ప్రాకులాడేను. రెండు గదుల పోర్షన్ దొరికింది. సరిపోదా ... ఇక రైల్వే టిక్కెట్సు ... రిజర్వేషన్స్ గొడవల్లో పడి, తేరే సరికి ... సారీ" "నెవ్వర్ మైండ్. బట్, నే నెంత ఆందోళన పడ్డానో తెలుసా!" "ఎందుకో! మోసం చేసి పోయానేమోననా?" "ఛ ... అలా ఎందుకు అనుకోవాలి!" "మరెలా అనుకోమంటావ్?" - చిరునవ్వు. "సర్లే బాబూ, నీతో మాట్లాడలేను ..." "అసలు సంగతి దాటేయకు ..." - అదే నవ్వు. చిన్నగా మొహం అదోలా ఆడించి, చిరునవ్వు నవ్వేసి, ఊరుకుంది వైజా - పూర్తి పేరు వై.జయంతి. నేను కూడా పెద్దగా ఒత్తిడి తేలేదు. ఆమెను మరి ఆట పట్టించదల్చలేదు. ఆమెనే చూస్తున్నాను. వైజా ప్రతి కదలికలోనూ ఏదో అందం ... అది నా కెంతో ఆనందం ... "ఏమిటలా చూస్తున్నావ్" ఆగి, అడిగింది - కనురెప్పలను చకచక ఆడిస్తూ. "ఏం చెప్పమంటావ్" కొంటెగా నవ్వేశాను. వైజా జవాబు ఇవ్వలేదు. మా మధ్యకు మౌనం ఒక మారు చొరవగా చొరబడింది. ఈనాటి వైజాతో నా పరిచయం, ఏనాటి సుకృతమో! కాలక్షేపం కోసం నా దగ్గర ఉన్న వీక్లీలను అడిగి తీసుకునేది. అప్పుడే ఆమెతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ తరవాత ఆమె పట్ల ఏర్పడ్డ జాలీ, అభిమానమూ - ఆమెకు నా మీద ఏర్పడ్డ కృతజ్ఞతా భావమూ - మా ప్రేమకు త్రోవ చూపాయి. మేము ఒకరి నొకరం పూర్తిగా అర్థం చేసుకున్నాం. ఆ పిమ్మటే, మేము పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాం. నేను డిగ్రీ పుచ్చుకున్న దగ్గర నుంచి ఉద్యోగాల వేటలో తల దూర్చాను. వచ్చే అవకాశాలు తక్కువ ... కలిగే ఆశలు ఎక్కువ ... నన్ను సతమత పరు స్తుండేవి ... లభ్యం కానప్పుడు బాధ ... మరో అవకాశం వస్తే ఉబలాటం ... ఆశ, నిరాశల మధ్య పోరాటం ... ఆరాటం. అలాంటి సమయాల్లో వైజా ఓదార్పు ... మాట తోడు ... కొంత ఊరట. ఆ రోజు - ఒక ప్రయివేట్ ఫర్మ్ లో క్లర్క్ గా జాయిన్ అవ్వమని ఆర్డర్స్ రావడం కాస్తా ఆనందపరిచినా ... 'చాలా దూరం కదా' అన్న భయం ... అది గమనించిన వైజా - "సర్లే, బాబూ, నీకు ఇక్కడే, ఈ ఊళ్లోనే జాబ్ రావాలంటే ఎలా? ఎక్కడ కైనా వెళ్లాలి ... వచ్చిన అవకాశాన్ని జార విడుచు కుంటే అవివేకం ఈ రోజుల్లో ..." అంది మందలింపుగా. "అది కాదు, వైజా" "ఏదీ కాదు. వెళ్లాలి, జాయిన్ అవ్వాలి" నేనేమీ మాట్లాడలేకపోయాను. "ఒక విధంగా ఇది మన మంచికే జరిగిందని ఆనందించాలి" - వైజా. ఆమె వంక చూశాను. "ఏమిటి, అలా షాక్ తిన్న వాడిలా అయిపోయావు?" - వైజా గొంతుతో, అవస్థలోంచి బయటపడ్డాను. తేరుకుంటూ అన్నాను - "ఉహు" "ఏమిటి, ఉహూ!" "పోనీ, ఆహఁ" నవ్వేసింది వైజా. నేను కూడా. మౌనంను తుంచుతూ, పిలిచాను - "వైజా" "ఉ" "రేపే ... మన ప్రయాణం" క్షణకాలం మౌనం. "ఎన్ని గంటలకు?" లోగొంతులో అడిగింది వైజా. చెప్పాను, వివరంగా. తరవాత వెంటనే అడిగాను, "వస్తావు కదూ?" ఆత్రంగా. సన్నగా నవ్వింది వైజా - "రావద్దా" అంటూ. మాట్లాడలేక పోయాను. ఆమె వైపు చూశాను. ఆమె కళ్లల్లో అగుపించే భావం నన్ను కదిలించి వేస్తూంది. చిన్నగా నవ్వుతున్నాను. "ఎందుకో" అడిగింది. "ఏమిటి" అడిగాను. "ఆ నవ్వు" "నా కోసమే" మెత్తగా నవ్వింది వైజా - "నీ కోసమా" అని. "ఉ, నే నెంతో అదృష్టవంతుణ్ణి అని మురిసిపోతున్నాను" "అదృష్టమంతా ఒకరిదే అయితే ఎలా!" సన్నగా నవ్వింది వైజా. అప్పుడే పార్కులో లైట్లు వెలిగాయి. వైజా వెళ్లిపోడానికన్నట్టు కదులుతూంది. "వైజా" పిలిచాను. "ఉ" కొట్టింది. "రేపు వస్తావుగా" ఉండలేక అడిగాను. వెంటనే లేచి నించుంది. నేను కూడా ... ఆ పొద చాటు నుంచి కదిలి పార్కులోంచి బయటపడ్డాం. "వైజా" పిలిచాను మళ్లీ. వైజా మాట్లాడడం లేదు. నాలో ఆత్రం జోరెక్కుతుంది - "రావాలా" సడన్ గా అడిగింది వైజా. "వ్వాట్" చిన్నగా కేక వేశాను. వైజా నడుస్తూ ఆగిపోయింది. కళ్లతోనే కవ్వించి చిన్నగా నవ్వింది, నాకు నవ్వురావడం లేదు. "రేపు ... రైల్వే స్టేషన్ లో కలుస్తా ... బై బై" అనేసి అక్కడ నుంచి కదిలిపోయింది వైజా. నేను మాత్రం అక్కడే ఉండిపోయాను, ఆమె కనుమరుగయేంతవరకు. తరవాత చిన్నాన్న గారింటి వైపు కదిలాను. అమ్మ, నాన్న - నా చిన్నప్పుడే పోయారు. అప్పటి నుంచి నేను చిన్నాన్నగారి నీడలోనే ఉంటున్నాను. నాకు తోబుట్టువు లంటూ లేరు. నేను ఇంటిని చేరే సరికి, మా ఎదురు ఇంటి తలుపులు మూసేసి ఉన్నాయి. ఆ ఇల్లు వైజాది ... కాదు, కాదు - ఆ ఇల్లు వైజా పిన్నిగారిది. ఏ దిక్కూలేని వైజా(ను) ఆ ఇంటి పని మనిషి (లా ట్రీట్ చేస్తుంటారు ఆ ఇంటి వాళ్లంతా). మర్నాడు - వీధి చివరి వరకు నాతో వచ్చి, "ఉత్తరాలు వ్రాస్తుండు" అని చెప్పేసి వెళ్లిపోయారు చిన్నాన్న. స్టేషన్ వరకు రాలేనన్నారు, ఆఫీసుకు టైమయ్యిపోతుందన్నారు. అతను నాతో రాకపోవడమే నాకు కావాలి. గుండె నిండా గాలి పీల్చుకున్నాను. స్టేషన్ వైపు నడిచాను వడివడిగా. చేతిలోని సూట్ కేస్ పెద్ద బరువు అనిపించలేదు! వైజా నా కంటే ముందే వెళ్లిపోయి ఉంటుందా? - ఏమో - మా ఎదురింటి తలుపులు తీసే ఉన్నాయి. కానీ, వైజా కనిపించలేదు! నేను ప్లాట్ ఫారం మీదకు వెళ్లేసరికి - " ... ఎక్స్ ప్రెస్ మరి కొన్ని నిమిషాల్లో ఒకటో నెంబర్ ప్లాట్ ఫారం మీదకు రానున్నది ..." అన్న తెలుగు ప్రకటన వినిపించింది. ఆశ్చర్యపోయాను. ఏ ఎక్స్ ప్రెస్?! - హిందీ, ఇంగ్లీష్ ప్రకటనలు ముందే అయిపోయినట్టు ఉన్నాయి - అక్కడ, ఎవరో అతన్ని అడిగాను - "ఏ ఎక్స్ ప్రెస్, సార్" అతను చెప్పాడు. గుండె గతుక్కుమంది. అప్పుడు అటు ఇటు చూశాను వైజా కోసం. నా చూపులకు అందలే దామె! "అరె" - బయటకే అనేశాను. ఆశ్చర్యం వేసింది. ఆత్రం హెచ్చింది. ఆలోచనలు లేచాయి, పరిపరి విధాలుగా పయనిస్తున్నాయి. చెడు కూడా కొంత వరకు ఆలోచనల్లో చోటు చేసుకుంటోంది ... నాలోని హుషారుకు నీరసం వచ్చింది. చేతిలోని సూట్ కేస్ భారం అనిపించింది. దాన్ని ప్రక్కన పెట్టాను. ఆత్రంగా అన్ని వైపులను మళ్లీ పరీక్షగా చూస్తున్నాను. క్షణాలు ఆందోళనగా దాటి పోతున్నాయి. అప్పుడే దడదడ శబ్దం చేస్తూ ఎక్స్ ప్రెస్ వచ్చి ఆగింది. నాకు ఇంచుమించుగా ఏడుపు వచ్చేస్తూంది. ప్లాట్ ఫారమంతా ఒక్కమారుగా గందరగోళంగా ఉంది. నా మనసు చిందరవందరై పోతూంది. ఒక వైవు దేవుళ్లుకు మొక్కుకుంటున్నాను ... మరో వైపు వైజాను కసిగా తిట్టుకుంటున్నాను ... అంతలోనే - దూరంగా - గబగబా ఇటే వస్తూన్న వైజాను చూసి గతుక్కుమన్నాను ... వెంటనే సిగ్గుతో తల దించుకున్నాను ... నాకు దగ్గరగా వైజా వచ్చేసింది. అడిగింది, "ఇదేనా మనది" - ఆగి ఉన్న ఎక్స్ ప్రెస్ వైపు చూస్తూ గబగబ. కొన్ని క్షణాలవరకూ నేనేమీ మాట్లాడలేకపోయాను. "అరె ఏమిటి, ఇదేనా" - ఈ సారి కాస్తా చిరాకుగా అడిగింది. "ఉ" అంటూ కంపార్టుమెంట్ వైపు కదిలాను, చేతిలోకి సూట్ కేస్ ను తీసుకుంటూ. వైజా నన్ను ఫాలో అవుతూంది. కంపార్టుమెంట్ ముందున్న కండక్టర్ ను అడిగాను, టిక్కెట్టు చూపిస్తూ, మా సీట్లకై. అతను చెప్పాడు. మేము అటు కదిలాం. లోనికి చొరబడ్డాం. ప్రయాణీకులు అంతగా లేదు. మాకు కేటాయింపబడ్డ సీట్లు వద్ద ఆగాను. "ఇవే" అన్నాను. 'అమ్మయ్య' అనుకుంటూ సీట్లో కూచుంది వైజా. నేను నా సూట్ కేస్ ను, సీటుకు కిందన సర్ది, వైజా పక్కన కూర్చున్నాను. మేము ఉన్న సీట్లు చెంత ఎవరూ లేరు. "ఎందుకు ఆలస్యమైంది" నెమ్మదిగా అడిగాను. "ఏమీ లేదు" ముభావంగా అంది వైజా. "నేను నమ్మను" "ఎందుకో భయం" ఆగి, చెప్పింది వైజా. "ఎందుకో" "ఏమో చెప్పలేను" "అంటే!" "సర్లే బాబూ. ప్లీజ్ నొక్కి నొక్కి అడగకు" నే నేమీ మాట్లాడలేక పోయాను. "ఇంత ఖాళీయా" అంది వైజా. "ఏమో ఈ రోజు బాగుంది" అన్నాను. వైజా నన్ను పిలిచింది, కొన్ని క్షణాల తరవాత. "ఉ" కొట్టాను. "కోపం వచ్చిందా" - నా చూపుల్లోకి చూస్తూ అడిగింది. "ఎందుకు!" - అడిగాను. "నువ్వు అడిగిన దానికి కారణం చెప్పనందుకు" "చ ఛ. అది కాదు" - అన్నాను. "అంటే" "రావేమో, అని ... టెన్షన్" చెప్పాను. చిన్నగా నవ్వేశాను. ఆగి, వైజా చెప్పింది: "నా బట్టలు, అవి ఇవి, తెచ్చుకోవడానికి వీలు కుదర లేదు. ఇలాగే వచ్చేయగలిగాను. సారీ" "ఫర్వాలేదు, ఫర్వాలేదు. వెళ్లిన వెంటనే అన్నీ సమకూర్చుకుందాం. మన పెళ్లికి ఏర్పాట్లు చేసి వచ్చాను. దానికీ కొత్త బట్టలు తీయాలిగా. అప్పుడే అన్నీ చేకూర్చుకుందాం. సరేనా" అన్నాను వెంటనే. అదోలా తల ఊపింది వైజా. వెంటనే, "ఇదిగో" అంటూ, ఒక చిన్న కాగితం పొట్లాన్ని నా కందిస్తూంది. "ఏమిటి!" దాన్నందు కోకుండానే అడిగాను. "డబ్బు, నాది. నేను కూడబెట్టుకుంది" చెప్పింది వైజా. చిన్నగా నవ్వేసి, "ఉంచు, నీ దగ్గరే ఉంచుకో" అన్నాను. "ఉహు" "ప్లీజ్." అన్నాను. వైజా మరి ఒత్తిడి చెయ్యలేదు. ఆ పొట్లాన్ని తిరిగి తన జాకెట్టులోకి జార విడిచింది. రైలు కదిలింది. మా వైపు మరెవరూ రాలేదు. నే నామెకు దగ్గరగా జరిగాను. ఆమె కుడి చేతిని నా చేతుల్లోకి తీసుకున్నాను. మెత్తగా ఆమె వేళ్లను నొక్కుతూ కూర్చున్నాను ప్రశాంతంగా. "ఏమైనా మాట్లాడు" అంది వైజా. "ఏం మాట్లాడమంటావు?" - చిన్నగా నవ్వుతున్నాను. "ఏమైనా" - కళ్ల చివరల్లోంచి నన్ను ఒకసారి చూసి అంది వైజా. నేనూ గమ్మత్తుగానే నవ్వేను. వైజా చెంత నాకు మాటలుకు ఎప్పుడూ కరువే! "ఏమైనా పుస్తకాలు తేలేదా" అడిగింది వైజా. "ఉహు. తరవాత స్టేషన్ లో తీసుకుంటాను" చెప్పాను. "ఎంతకు దిగుతాం" ఆగి, అడిగింది వైజా. చెప్పాను. ఆమె నా వాచీలోకి చూసింది. తరవాత మా మధ్య సంభాషణ మరో వైపుకు మలుపు తిరిగింది, వైజా చొరవతో. చాలాసేపటికి రైలు ఒక స్టేషన్ లో ఆగింది. నేను కిందకు దిగాను. బత్తాయి పళ్లు, రెండు వీక్లీలు, ఒక డైలీ కొని, తిరిగి వచ్చాను. రైలు కదిలింది. నిజం చెప్పాలంటే, వైజా పుస్తకాల పురుగు. నాకు తెలిసినంతవరకు, ఆమె చేతిలో పుస్తకం ఉంటే, ఆమె దృష్టిని మరో వైపుకు మార్చాలంటే చాలా కష్టం. తెలిసి, అందుకే నే నామెను డిస్టర్బ్ చెయ్యడానికి ప్రయత్నించక, డైలీ లోకి తల దూర్చాను. నేను డైలీలోంచి తలెత్తేసరికి చాలా టైం అయింది. వైజా వంక చూశాను. కళ్లు మూసుకొని ఉంది. ఆశ్యర్యంగా అడిగాను: "ఏమిటి, వైజా, అలా కూచున్నావ్. పుస్తకాలు రెండూ ఐపోయాయా!" "తల నొప్పిగా ఉంది" చెప్పింది. "అరె" అంటూ నొచ్చుకుంటున్నాను. "ఏం ఫర్వాలేదు. కాస్తా నడుం వాలుస్తాను" అంది. "సరే, అలా పడుకోవచ్చుగా." అన్నాను. "నీకు బోరేమోనని" వైజా అంది. "ఏం కాదు. పడుకో" చెప్పాను. వైజా ఎదురు సీటు మీద నడుం వాల్చింది, నాకు వీపును చూపిస్తూ. నేనూ ఉన్న సీటు మీద నడుం వాల్చాను. ఎప్పుడు పట్టేసిందో నిద్ర, నేనూ పడుకుండిపోయాను. నేను లేచేసరికి, వైజా లేచి ఉంది. పుస్తకం చదువుతూంది. "తల నొప్పి తగ్గిందా" అడిగాను. "ఆఁ. చాలాసేపు అయింది" పుస్తకం లోంచి తలెత్తకుండానే చెప్పింది వైజా. నేను చిన్నగా నవ్వేశాను. "నన్ను లేపేయలేకపోయావా" అన్నాను. "సర్లే బాబూ, పడుకోనీ, అనుకున్నా" - వైజా ఇంకా పుస్తకంలోంచి తల తిప్పడంలేదు. వెళ్లి, మొహం కడుక్కొని వచ్చాను నేను. నేను వైజాతో ఏదో మాట్లాడాలని ప్రయత్నించినప్పుడు, "ప్లీజ్, డిస్టర్బ్ చెయ్యకు" అంది తను. నా ప్రయత్నం విరమించుకున్నాను. రైలు ఆగింది - చాలాసేపటి తరవాత. అంతలోనే - కిటికీలోంచి ఒక అమ్మాయి కంపార్టుమెంట్ లోకి ఆత్రంగా చూస్తూ - "ఏమండీ, ఇందులో మా మగాయన ఉన్నారా" అని అడిగింది, గబగబా. ఆ అమ్మాయి కళ్లు నీళ్లతో తడిచి ఉన్నాయి. ఇంచుమించుగా ఆమె వయస్సు వైజా కున్నంతే ఉంటుంది. ఆ అమ్మాయి విసురుగా అక్కడ నుంచి కదిలింది. ముందుకు వెళ్తోంది. ప్రయత్నంతో నేను కిటికీలోంచి చూపును బయటకు పెట్టి చూస్తున్నాను - ఆ అమ్మాయి కేసి. వైజా కూడా నాలాగే చేస్తోంది. ఆ అమ్మాయి అన్ని కిటికీల్లోంచి లోనికి చూస్తూ ముందుకు పోతోంది. అంతలోనే రైలు కదిలిపోయింది. ఆ అమ్మాయి ప్రయత్నం విఫలమైంది. ఎవరో, ఆమెను పట్టి, ప్లాట్ ఫారం మధ్యకు లాగేశారు. ఆమె అక్కడే చతికిలి బడిపోయింది. ఆమెను దాటుకుంటూ రైలు పరుగు తీస్తోంది. నేను సర్దుకొని, వైజా ప్రక్కన కూర్చున్నాను. "ఏమిటి ... ఏమైంది. ఆ అమ్మాయి ఎందుకు అలా ప్రవర్తిస్తోంది." అడిగింది వైజా. ఆమె గొంతులో సన్నని జీర. "పాపం. ప్చ్. ఆ అమ్మాయిది ఒక విషాదపూరితమైన కథ" అన్నాను. అదోలా నా కళ్లల్లోకి చూసింది వైజా. "ఏమిటటా" అడిగింది. "క్రితంసారి నేను వచ్చినప్పుడు ఆమె ఇలాగే ప్రవర్తించింది. అప్పుడే తెలుసు కున్నాను, ఆమె గురించి. ఆ అమ్మాయి భర్త ఒక రైలు ప్రమాదంలో చని పోయాడట. పెళ్లయిన వారం రోజుల తరవాత ఆ దుర్ఘటన జరిగిందట. ఏదో ఊరు వెళ్లి, వస్తానని చెప్పి, అతను రైలు ఎక్కాడట. ఆమె కూడా స్టేషన్ కు వెళ్లిందట. తరవాత, అతను తిరిగి మరి రాకపోయేసరికి, ఆమె మానసికంగా దెబ్బ తిందట. అప్పటినించి ఇదే వరసట." చెప్పాను. "అంటే పిచ్చిదైపోయిందా" టక్కున అడిగింది వైజా. "ఉ" కొట్టాను. తలెత్తి నా కళ్లల్లోకి చూస్తూ ఉండిపోయింది వైజా. ఆమె ప్రవర్తన చూస్తూంటే, నాకు వింతగా, భయంగా ఉంది. "ఏమిటి అలా చూ ..." నేనింకా పూర్తిగా అడగనేలేదు - వైజా చివుక్కున లేచి, నా కాళ్లపై పడింది. "అరె, వైజా, ఏమిటిది. లేలే" కంగారుగా అన్నాను. "నువ్వు, ఉహు, కాదు, కాదు ... మీరు, మీరు దేవుడు లాంటి వారండి. ఉహు, కాదు, కాదు ... మీరూ ఒక దేవుడే నండీ ... దేవుడే నండీ" అనంటోంది వైజా. ప్రయత్నంతో ఆమెను పైకి లేవనెత్తాను. ఆమె కళ్లల్లోంచి నీళ్లు ధారలుగా బయట పడుతున్నాయి. వైజా నన్ను గాఢంగా కౌగిలించుకుంది. "పిచ్చి, వైజా. ఇంతగా చలిస్తున్నావేమిటి! ఇంతగా నన్ను ఎందుకు పొగిడేస్తున్నావు? నీ దృష్టిలో ఏమో కాని, నాకు మాత్రం నే నా పొగడ్తలకు అర్హుణ్ణి కానేమో ననిపిస్తోంది" అన్నాను. వైజా ఏమీ మాట్లాడడం లేదు. ఆమె కన్నీళ్లు నా భుజాన్ని వెచ్చగా తాకుతున్నాయి. 'నేనేం గొప్పవాణ్ణి? వైజా నన్ను ఎందుకు ఇలా ట్రీట్ చేస్తోంది! నిజానికి, ఎవరికీ తెలీకుండా, వైజాను ఇలా తీసుకుపోతూంటే, నేనేం గొప్పవాణ్ణి?! అయినా, నే నీ విషయాన్ని అంతగా ఎన్నడూ పట్టించుకోలేదు. నాకు కావలసింది వైజా. వైజాను నేను ప్రేమిస్తున్నాను. ఆమే నా లోకం. అందుకే - నా చెయ్యి అందించి, 'మళ్లీ ముత్తయిదువు' ల్లోకి వైజాను తీసుకు వెళ్తున్నాను - ఇదో గొప్పా? ఏమో ... మరి!' - ***

© All rights reserved


Did you enjoy reading this story? Even you can write such stories, build followers and earn. Click on WRITE below to start.

(*)star-filled(*)star-filled(*)star-filled(*)star-filled(*)star-filled
Comments (3)